
కడెం, వెలుగు: రైతులకు సాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండల కేంద్రంలోని ఎడమ కాలువకు రూ.39 లక్షలతో 16 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రిపేర్లు, సదర్మాట్ కాలువకు రూ.34.50 లక్షలతో 21కిలోమీటర్ల వరకు చేపట్టే రిపేర్ పనులకు ఎమ్మెల్యే సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. రైతాంగానికి సాఫీగా సాగునీరు అందించేందుకు రిపేర్లు చేపడుతున్నామని అన్నారు.
రైతు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. లింగాపూర్ వద్ద కూలిన సదర్మాట్ గోడకు వెంటనే రిపేర్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇటీవల చనిపోయిన పలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఇరిగేషన్ ఈఈ విఠల్ రాథోడ్, ఎంపీడీవో అరుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, మల్లేశ్ యాదవ్, సతీశ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎ.లచ్చన్న, జి.చంద్రశేఖర్, జి.మల్లేశ్, బి.గంగన్న తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
జన్నారం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలో రూ.35.50 లక్షలతో చేపట్టే ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీస్ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగులో సూచనలిస్తూ కీలకంగా వ్యవహరించే ఇరిగేషన్ శాఖను పటిష్టం చేస్తున్నామని, శిథిలావస్థలో ఉన్న ఇరిగేషన్ భవనం స్థానంలో కొత్తదాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ వెంకటేశ్, జేఈ శ్రావణ్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.