భద్రాచలం,వెలుగు : భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని మహబూబ్‌బాద్ ఎంపీ, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సూచించారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు బాగాలేవని, భారీ వానలతో నదులు, వాగులు పొంగుతున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతోందని తెలిపారు. భద్రాచలంలో కరకట్టలు కట్టడానికి, ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి కేంద్రం సహకరించాలని కోరారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఈ ప్రాంతంలో నేడు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడానికి ప్రధాన కారణంగా కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. విభజన చట్టంలో లేని ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేస్తుంటే, సీలేరు విద్యుత్ కేంద్రాలు ఆంధ్రాకు పోతుంటే ఆనాడు అడ్డుకోలేక పోయిన కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేల్చడం సరికాదని మండిపడ్డారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.