- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- రూ.35 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
అమీన్ పూర్, పటాన్ చెరు, వెలుగు: పటాన్ చెరు నియోజకవర్గంలోని విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో ఉపాధి లభించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం కాలేజీలో జేకే ఫెన్నార్, కిర్బీ పరిశ్రమల సౌజన్యంతో రూ.35 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు కోసం జీవో జారీ కాగా ప్రస్తుత ప్రభుత్వంలో కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిగ్రీ కాలేజీలో క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయడంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కంప్యూటర్ ల్యాబ్ కోసం రూ.35 లక్షల సీఎస్ఆర్ నిధులు కేటాయించిన జేకే ఫెన్నార్, కిర్బీ పరిశ్రమ యాజమాన్యాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జేకే ఫెన్నార్ పరిశ్రమ సీఎస్ఆర్ ప్రతినిధి సర్వేశ్ అమృత్, కిర్బీ హెచ్ఆర్ ప్రతినిధి నాగరాజు, ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.
