
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పట్ల శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. డిగ్రీ కాలేజీలకు రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లిస్తారుగానీ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించరా? అని ప్రశ్నించారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలంటూ విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. టైంకు పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పీజీసెట్, లాసెట్, ఇతర పోటీ పరీక్షలు రాసేందుకు మూడో ఏడాది విద్యార్థులు అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ‘‘ఏప్రిల్ లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగానితనమే. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నది.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కాలేజీలకు తాళం వేసి సెలవులు ప్రకటించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం రూ.19,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వలేదు. ఆరు గ్యారంటీల్లో యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదు’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.