బ్యాంకర్లా.. రజాకార్లా..? ఊళ్లమీద పడి రైతులను వేధిస్తున్నరు: హరీశ్ రావు

బ్యాంకర్లా.. రజాకార్లా..? ఊళ్లమీద పడి రైతులను వేధిస్తున్నరు: హరీశ్ రావు
  •    వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  •     రుణమాఫీ పైసలు కట్టొద్దని రైతులకు సూచన
  •     ఎండిన పంటలకు ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలి 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో బ్యాంకర్ల తీరు రజాకార్లను తలపిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు మండిపడ్డారు. బ్యాంకర్లు గ్రామాలపైకొచ్చి లోన్లు కట్టాలని రైతులను వేధిస్తున్నారని, లీగల్ నోటీసులు పంపించి కోర్టుకు ఈడుస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకూ రుణమాఫీ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. రైతులెవరూ బ్యాంకర్లకు భయపడొద్దని, పైసలు కట్టొద్దని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు ఒత్తిడి చేస్తే బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. అవసరమైతే చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడుతామని అన్నారు. రైతులను వేధిస్తున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు.  

రాష్ట్రంలో కరెంట్ కోతలు, సాగునీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయని, బ్యాంకర్లు ఇలా వేధిస్తే రైతులు ఎలా తట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాంకర్లు, రైతులకు మధ్య సంగారెడ్డి  జిల్లాలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఒక్కో ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.500 బోనస్ ఇచ్చి వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.  రైతు బంధు డబ్బులు విడుదల చేయాలన్నారు. వీటికి ఎలక్షన్ కోడ్ కూడా అడ్డు రాదని చెప్పారు. 

బీఆర్ఎస్ శ్రేణులు​ పొలాల్లోకి వెళ్లండి

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు, కార్యకర్తలంతా మంగళవారం నుంచి పొలాల్లోకి వెళ్లి పంట నష్టం వివరాలను సేకరించాలని హరీశ్​రావు పిలుపునిచ్చారు. రైతు పేరు, జరిగిన నష్టం వివరాలను గ్రామాలు, మండలాల వారీగా క్రోడీకరించి పార్టీ హెడ్ ఆఫీస్‌‌‌‌కు పంపించాలని ఆయన సూచించారు. ఆ లెక్కల ఆధారంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.

హామీల అమలులో కాంగ్రెస్​ విఫలం

కాంగ్రెస్ ఏదో చేస్తుందని నమ్మి రైతులు ఓట్లేశారని, కానీ వాళ్ల పరిస్థితి అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం ఊడినట్టుగా తయారైందని హరీశ్ పేర్కొన్నారు.  రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం, వరికి బోనస్ వంటి హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. కరెంట్, నీళ్లు ఇవ్వడంలోనూ రేవంత్ ఫెయిల్ అయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. తమ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని రేవంత్‌‌‌‌రెడ్డి దండుగలా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో బోర్లు వేయాల్సిన అవసరమే రాలేదని, ఇప్పుడు రైతుల కష్టమంతా బోరు పొక్కల్లోకే పోతున్నదని చెప్పారు.

పార్టీలో చేరికల మీద పెట్టిన దృష్టి రైతులను ఆదుకోవడం మీద పెట్టడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌‌‌‌ ఇప్పటివరకూ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్​ చేశారు.  బ్యాంకర్లకు రుణమాఫీ మీద ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఇంటికి పోయి బతిమిలాడి కాంగ్రెస్‌‌‌‌లో చేర్చుకుంటున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి.. రైతుల పొలాల్లోకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని అడిగారు. రాబోయే ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని హరీశ్​రావు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై దుష్ప్రచారం చేసి గెలిచిన కాంగ్రెస్‌‌‌‌.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీని అమలు చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీకి అసలు రైతులంటేనే పట్టింపు లేదని దుయ్యబట్టారు. అక్రమ కేసులు, బెదిరింపులతో నాయకులను లొంగ దీసుకోవడం మానేసి, ప్రజలకు ఏంచేయాలో దాని గురించి ఆలోచించాలని హితవు పలికారు. 

రెవెన్యూ అధికారులను కట్టడి చేయాలె: పల్లా 

రెవెన్యూ అధికారులు ఊళ్లపై పడి ఇష్టారీతిన రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు.  రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన సర్కారు‌‌‌‌ను నిలదీశారు. ధరణిలో లోపాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం 4 నెలలు అవుతున్నా ఎందుకు సరి చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.