అధికారంలో లేకపోయినా అభివృద్ధి చేస్తా: జగ్గారెడ్డి

అధికారంలో లేకపోయినా అభివృద్ధి చేస్తా: జగ్గారెడ్డి

గత నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గం అన్యాయానికి గురవుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం సంగారెడ్డిలో జరిగిన పురపాలక కార్యకర్తల సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… అధికారంలో లేకపోయినా నిధులు తీసుకొచ్చి సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి తన  పార్లమెంట్ నిధుల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు సంగారెడ్డి, సదాశివపేట పురపాలకకు ఇచ్చారో చెప్పాలని అన్నారు. ఈ విషయంపై శ్వేత పత్రం విడుదల చేయడానికి సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.

చింత ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డికి ఏం చేశారని ప్రశ్నించారు జగ్గారెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  సంగారెడ్డికి ఐఐటీ, పాలిటెక్నిక్, పీజీ సెంటర్ తీసుకోచ్చానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డికి పీజీ సెంటర్ తెస్తే…  టీఆర్ఎస్ ప్రభుత్వం పీజీ సెంటర్ తీసేస్తోందని తెలిపారు తన పార్లమెంట్ పరిధిలో పీజీ సెంటర్ పోతే.. కొత్త ప్రభాకర్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

గతంలో సింగూర్ నుంచి హరీష్ రావు నీళ్లు వదిలిపెడుతుంటే.. అప్పటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎందుకు అడ్డుకోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నీటి విడుదలను నేను అడ్డుకుంటే తనను అరెస్ట్ చేసి  కేస్ లు పెట్టారని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలో వరదలు వచ్చి సింగూర్ నిండితే..  ఒక్క చుక్క నీరు బయటికిపోకుండా అడ్డుకుంటానని జగ్గారెడ్డి అన్నారు.  పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే.. ప్రజలు కోరుకున్న అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన చెప్పారు. సోమవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పురపాలిక చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.