అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా దమ్మపేట మండలం గండుగులపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్పు క్రీడా పోటీలను ప్రారంభించి పలు సూచనలు చేశారు.
అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ.1.60 కోట్లతో అదనపు తరగతి గదులు నిర్మాణానికి, రూ. 80 లక్షలతో టీచర్ల సౌకర్యం కోసం ప్రత్యేక గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో టీపీసీసీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్ కలిసి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తొలగించడం అన్యాయమని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పేరాయిగూడెం, పేటమాలపల్లి, దొంతికుంట కాలనీలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడేండ్లలో నియోజకవర్గంలో నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతపరిచి పూర్తి చేస్తామన్నారు.
మహిళల గౌరవాన్ని పెంపొందించటమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఇందిరమ్మ చీరలను గౌరవప్రదంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో నాగరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, మొగళ్లపు చెన్నకేశవరావు, జూపల్లి రమేశ్, పీఆర్డీఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
