కర్నాటకలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ : జోగు రామన్న

కర్నాటకలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ : జోగు రామన్న

 ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్​లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని,  మెనిఫెస్టోలో పెట్టిన హామీల్లో కోటీ 90 లక్షల కుటుంబాలకు ధీమా కల్పించేలా రూ. 5 లక్షల బీమా అందించనున్నట్లు తెలిపారు.

సౌభాగ్య మహిళా పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నాటకలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీ సైతం ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసిందని గుర్తుచేశారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్, రైతులకు ఆదాయం రెట్టింపు హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఫైర్​ అయ్యారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పార్టీ నాయకులు అజయ్, వేణుగోపాల్ యాదవ్, గంగారెడ్డి, స్వరూప రాణి పాల్గొన్నారు.