విద్యారంగానికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విద్యారంగానికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు : రాష్ట్ర సర్కారు విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్​ లో కలెక్టర్​రిజ్వాన్​ భాషా షేక్, అడిషనల్​ కలెక్టర్, ఇన్​చార్జి డీఈవో పింకేశ్​కుమార్​తో కలిసి స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పనితీరు, నిర్వహణ, సమస్యలు, వసతుల కల్పనకు అవసరమైన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలన్నారు. సీసీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. 

జఫర్ ఘడ్, స్టేషన్ ఘన్​పూర్ కేజీబీవీ, మోడల్ స్కూల్స్ కి అప్రోచ్ రోడ్లను వేయాలన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని ధర్మసాగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను వెంటనే మరో భవనానికి మార్చాలన్నారు. అన్ని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల్లో వాటర్ హీటర్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ డీఈవో వాసంతి, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.