
హనుమకొండసిటీ, వెలుగు: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు, జేఎన్ఎస్ లో తాత్కాలిక స్పోర్స్ట్ స్కూల్ నిర్వహణపై ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీశ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా క్రీడల అధికారితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో ఇంటర్మీడియట్ వరకు విద్యనందిస్తే అండర్–19 వరకు వివిధ క్రీడల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా హనుమకొండ జెఎన్ఎస్ లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్లో సౌకర్యాలు కల్పించాలని, మరమ్మతులు చేయించి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్లో హాస్టల్స్ సౌకర్యం ఉండాలని, తరగతి గదులకు వాటర్, ట్రాక్స్ ఉండాలన్నారు. కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ కు అవసరమైన 20 ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి గుగులోతు అశోక్ కుమార్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ ఖాన్, కుడా పీవో అజిత్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ టెక్నీకల్ డీడీ చంద్రారెడ్డి పాల్గొన్నారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు జేఎన్ఎస్ లోని స్పోర్ట్స్ హాస్టల్ ను సందర్శించనున్నారు. స్పోర్ట్స్ స్కూల్, హాస్టల్ ఏర్పాటుపై సూచనలు చేయనున్నారు.