ఇండిపెండెంట్గా పోటీ చేస్త.. వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా

 ఇండిపెండెంట్గా పోటీ చేస్త..   వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా

ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.   రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్,  సీఎం జగన్ కు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన  రామచంద్రారెడ్డి.. సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.  జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్‌ నుంచి వచ్చానన్న రామచంద్రారెడ్డి... తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు.  

జగన్‌ చెప్పిన ప్రతి పని చేశామని ఇప్పుడు... సర్వే పేరు చెప్పి టికెట్‌ ఇవ్వలేమనడం బాధగా ఉందని  కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీసం జగన్ తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.   వచ్చే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.  కాపు రామచంద్రారెడ్డి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించటంతో వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

కాపు రామచంద్రారెడ్డి 2009లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడరు.  రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు.  2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.   రాష్ట్ర విభజన తరువాత ఏపీలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 14 వేల 49 ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.