
- అటునుంచి అసెంబ్లీకి
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు శనివారం తన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అనుచరులతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా.. భారీ కాన్వాయ్‌తో గన్ పార్క్ వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరవీరుల స్తూపం అంటే తనకు దేవాలయంతో సమానమని, రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటారని చెప్పారు.
అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ...ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని, ఈ సమయంలో బాధ్యతగల ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే అసెంబ్లీ సమావేశాల కన్నా వరద ప్రాంతాల్లో పర్యటించి, వారిని ఓదార్చడమే తనకు ప్రధానమని చెప్పారు. కాగా, అసెంబ్లీ లాబీలో రాజగోపాల్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ఎదురుపడగా.. వారి మధ్య సరదా సంభాషణ జరిగింది.
‘మంత్రి ఎప్పుడవుతున్నావు?’అని కేటీఆర్ అడగ్గా.. ‘చూద్దాం’అంటూ రాజగోపాల్‌రెడ్డి ముక్తసరిగా జవాబిచ్చారు. ‘ఇవ్వాళ ఒక్కరోజే అసెంబ్లీకి వస్తానన్నావట. రేపటి నుంచి రానని అన్నావట కదా?’అని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అడిగారు. దీనిపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. రాష్ట్రంలో వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారంపాటు అసెంబ్లీ వాయిదా వేస్తారేమోనని అనుకున్నానని, కానీ దీన్ని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.