ఆలస్యమైనా పర్వాలేదు.. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఆలస్యమైనా పర్వాలేదు.. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.. వివిధ కారణాల వల్ల పదవి ఇవ్వలేదు. మంత్రి పదవి విషయంలో ఆలస్యమైనా పర్వాలేదు. నేను ఎదురు చూస్తా. నాకు ఓపిక ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మరోసారి ఎలాంటి త్యాగనికైనా రాజగోపాల్ రెడ్డి సిద్ధం.. మీరు కూడా సిద్ధంగా ఉండండని పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. 

ఆదివారం (సెప్టెంబర్ 7) మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతాడు అనే అభిప్రాయం మీకు ఉంది.. ఇకపైనా అదే విధానాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎంతో లాలూచీపడి మంత్రి పదవి ఇవ్వగానే సైలెంట్‎గా కూర్చొనే రకం తాను కాదన్నారు. గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టానని గుర్తు చేశారు. 

ALSO READ : మా సపోర్టు ఆయనకే..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

నా రాజీనామా వల్ల చౌటుప్పల్‏కి వంద పడకల ఆసుపత్రి, గట్టుప్పల్ మండలం, చండూరు రెవిన్యూ డివిజన్, శివన్న గూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం వంటి పనులు జరిగాయని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే పదవి వద్దు.. పైసలు వద్దు.. నా ప్రాంత ప్రజల ముఖ్యమని చెప్తానని స్పష్టం చేశారు.