బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలను సమాధి చేయాలి:కూనంనేని

బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలను సమాధి చేయాలి:కూనంనేని
  • సునీతామహేందర్​రెడ్డికి  సీపీఐ మద్దతు ఉంటది
  •  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు

అల్వాల్, వెలుగు: పదేండ్లు దేశాన్ని దోచుకున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్​ను లోక్​సభ ఎన్నికల్లో సమాధి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. అల్వాల్ పరిధి లోతుకుంట శుభశ్రీ గార్డెన్స్ లో ఆదివారం మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గ సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. 

కూనంనేని సాంబశివరావుతోపాటు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రవీంద్రాచారి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సహాయ కార్యదర్శులు జి.దామోదర్ రెడ్డి, ఉమామహేశ్​హాజరయ్యారు. మల్కాజిగిరి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్​రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటుందని విమర్శించారు. లోక్​సభ ఎన్నికలను హిందూ, ముస్లిం యుద్ధంలా మార్చాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని, అందుకే విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. మతం పేరుతో ఓట్లు అడిగే బీజేపీని, అవినీతి బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. సునీతామహేందర్ రెడ్డి గెలుపు కోసం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని చెప్పారు.