ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గండీడ్ ,వెలుగు:  సీఎం కేసీఆర్‌‌‌‌ సర్కారు బడులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి చెప్పారు. మంగళవారం మహ్మదాబాద్ మండలం కంచనపల్లి కేజీబీవీలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులు, హాస్టల్‌‌ బిల్డింగ్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం  గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. స్టూడెంట్లు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.  కాగా, డ్యూయల్ డెస్క్ బెంచీల కొరత ఉందని స్టూడెంట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. సరిపడా తెప్పిస్తానని హామీ ఇచ్చారు.  అనంతరం గండీడ్ మండల పరిషత్ కార్యాలయంలో మహ్మదాబాద్, గండీడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ శ్రీని వాస్ రెడ్డి, ఎంపీపీ మధవి,  డీఈవో రవీందర్, జీసీడీవో పల్లవి, ఎంఈఓవెంకటయ్య, ఎంపీడీవో రూపేందర్ రెడ్డి, తహసీల్దార్‌‌‌‌ ఆంజనేయులు, పీఏసీఎస్‌‌ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు పార్వతమ్మ, ఆంజనేయులు పాల్గొన్నారు.

కల్వకుంట్ల ఫ్యామిలీపాలైన తెలంగాణ:  రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

నాగర్ కర్నూల్, వెలుగు: వేల మంది ప్రాణత్యాగాలు చేసి, కోట్ల మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ  కేసీఆర్ కుటుంబం పాలైందని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌‌  కె. లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర మంగళవారం కొల్లాపూర్ మండలం సింగోటం చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు లక్ష్మణ్‌ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. 34 రోజుల నుంచి  కొల్లాపూర్ నియోజకవర్గంలో 482 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ భరోసా ఇస్తున్న సుధాకర్ రావును అభినందించారు. పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొలువులు లేక యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన చెందారు.  కల్వకుంట్ల కుటుంబం పాలన గాలికొదిలేసి రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని,  బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది బీజేపీయేనని స్పష్టం చేశారు.  తెలంగాణలో గడీల పాలనను తరిమికొట్టి కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సుధాకర్ రావు మాట్లాడుతూ  కార్యకర్తలు, కొల్లాపూర్ ప్రజలిచ్చిన మనో ధైర్యంతో తాను పాదయాత్ర చేపట్టానన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి  కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 
 

లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు:  కలెక్టర్ షేక్ యాస్మిన్  బాషా

వనపర్తి, వెలుగు:  జిల్లాలో అనుకున్న లక్ష్యం మేరకు ఆయిల్‌‌ పామ్ సాగవుతోందని  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు.  మంగళవారం కలెక్టరేట్‌‌లో అగ్రికల్చర్, హార్టికల్చర్‌‌‌‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేయడం అభినందనీయమన్నారు.  రెండు శాఖల అధికారుల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.  రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు.  రైతులతో కలిసి ఒక వాట్సప్‌‌ గ్రూప్ కూడా చేయాలని  చేయాలని చెప్పారు. కొత్తకోటలో త్వరలోనే ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం  హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ సురేశ్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతలుకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నామని చెప్పారు.   కార్యక్రమంలో డీఏవో సుధాకర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ రామ్ మోహన్, ఏవో రామ్ చందర్ రావు, ప్రి యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారి కుమార్
 పాల్గొన్నారు. 

ముంపు ప్లాట్లకు పరిహారం ఇవ్వాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి  విజయరాములు 

వనపర్తి, వెలుగు:  వనపర్తి శివారులోని చెరువుల్లో ముంపునకు గురవుతున్న ప్లాట్లకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి  కె.విజయరాములు డిమాండ్ చేశారు.  ‘రియల్‌‌ మోసం’ పేరిట ‘వెలుగు’లో వచ్చిన కథనాన్ని మంగళవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో చూపించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ శివారులోని నల్లచెరువు, తాళ్లచెరువు, మర్రికుంట మరో రెండు చెరువుల అభివృద్ధి కారణంగా 120 ఎకరాలకు పైగా భూమి ముంపునకు గురవుతోందన్నారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టాదారుల నుంచి భూములు కొని ప్లాట్లు చేసి  సామాన్య జనాలకు అమ్మారని గుర్తుచేశారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడంతో వాళ్లు కొన్నారని, ఇప్పుడు ఎఫ్‌‌టీఎల్‌‌లో ఉన్నాయని అధికారులు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.  మునిగే భూములను ఎవరు కొనమన్నారని ప్రశ్నిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు  గతంలోనే ఎందుకు రాళ్లు ఎందుకు పాతలేదని  ప్రశ్నించారు. తప్పుంతా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలదేనని  విమర్శించారు.  దాదాపు 1200 ప్లాట్లు మునిగిపోతున్నాయని, మంత్రి  నిరంజన్ రెడ్డి  స్పందించి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు  కళావతమ్మ,  జె.చంద్రయ్య, కె శ్రీరామ్, మండల కార్యదర్శి రమేశ్, సహాయ కార్యదర్శి ఎర్రకురుమన్న పాల్గొన్నారు.


బీజేపీకి కార్యకర్తలే పునాది: జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి 

హన్వాడ , వెలుగు: బీజేపీకి కార్యకర్తలే పునాది అని,  పార్టీని బూత్‌‌స్థాయి నుంచి బలోపేతం చేయాలని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హన్వాడ మండల కేంద్రంలో జరిగిన పార్టీ బూత్ కమిటీ సమావేశానికి  చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.   వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే  కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. అనంతరం ఇతర పార్టీలకు చెందిన 30 మంది బీజేపీలో చేరగా.. కండువేసి  ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి,  ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పాలమూరు అసెంబ్లీ కన్వీనర్ అంజయ్య,  సీనియర్ నాయకులు ఎన్పీ వెంకటేశ్, హన్వాడ మండల అధ్యక్షుడు కొండా లింగన్న,  ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బాలాగోపి పాల్గొన్నారు.   


విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి

వనపర్తి టౌన్, వెలుగు:  విద్యారంగ సమస్యల పరిష్కారానికి  నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్  రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన వనపర్తి జిల్లాలోని పలు గవర్నమెంట్ స్కూల్స్ ను విజిట్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ  గత రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలిచిన తాను టీచర్లు,  ప్రభుత్వానికి వారధిగా పనిచేశానన్నారు.  కేజీబీవీ టీచర్లకు 12 నెలల జీతంతో పాటు మహిళా టీచర్లకు 180 రోజుల జీతంతో కూడిన మెటర్నటీ లీవ్స్ మంజూరు చేయించామన్నారు. కోర్టు కేసుల వల్లే  టీచర్ల  బదిలీలు, పదోన్నతులు  లేట్ అవుతన్నాయన్నారు. 13 జిల్లాల్లో ప్రస్తుతం స్పౌజ్ బదిలీలపై బ్యాన్ ఉందని,  వాటిని కూడా ఎత్తివేస్తామన్నారు. ఈహెచ్ఎస్‌లో ఉన్న లోపాలను సరిచేసి  అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు.   12 ఏళ్లుగా నిస్వార్థంగా  సేవలందించానని, మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని  కోరారు. పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ఎం.చెన్నయ్య. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.మహిపాల్ రెడ్డి, రాయినిపల్లి శ్రీనివాసులు, జీహెచ్ఎంలు మద్దిలేటి, గణేశ్ కుమార్ , చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు

నవాబుపేట, జడ్చర్ల టౌన్‌‌, వెలుగు:  అర్హులకు డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇండ్లు,  సొంత జాగా ఉన్న పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ మన్నెశ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు.  మంగళవారం నవాబుపేట మండలం యన్మన్​గండ్ల, రుద్రారం, తీగల్​పల్లి గ్రామాల్లో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్‌‌ ఇండ్లను ప్రారంభించారు. అలాగే దొడ్డిపల్లిలో సీసీరోడ్డు, నవాబుపేటలోని  కేజీబీవీ ప్రహారీ ఓపెన్‌‌ చేయడంతో పాటు జడ్చర్ల మండలం కొడుగల్‌‌లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,  మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీకి  భూమి పూజ చేశారు. అనంతరం జడ్పీహెచ్‌‌ఎస్‌‌లో టెన్త్‌‌ స్టూడెంట్లకు నియోజకవర్గ స్థాయి  క్విజ్ పోటీలు,  పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలను ప్రారంభించారు.  


ఏటీఆర్‌‌‌‌లో యాక్టివిటీస్ బాగున్నయ్:వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌‌ సొసైటీ ఇండియా డైరెక్టర్  విద్య ఆత్రేయ 

అమ్రాబాద్, వెలుగు:  అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ డైరెక్టర్ డా. విద్య ఆత్రేయ అభినందించారు. మంగళవారం ఏటీఆర్‌‌‌‌కు వచ్చి ఆమె  శాఖాహార, మాంసాహార జంతు గణనను పరిశీలించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి డెయిలీ యాక్టివిటీస్‌‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటీఆర్‌‌‌‌ అభివృద్ధికి ఫారెస్ట్ అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. టూరిజం, ట్రెక్కింగ్, టైలరింగ్ ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడం బాగుందన్నారు.  లింగాల మండలం రాంపూర్ పెంటలో నిమ్మల అంకులయ్య పూరి గుడిసె కాలిపోయిన ఘటన తెలుసుకున్న ఆమె రూ. 5 వేల సాయం అందించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌‌వో రోహిత్ గోపిడి, ఎఫ్ట్‌‌వో విశాల్, మన్ననూర్ రేంజర్ ఈశ్వర్,  వైల్డ్ లైఫ్ కన్జర్వేష్‌‌ సొసైటీ కో ఆర్డినేటర్ సిద్దిక్,  టైగర్ కన్జర్వేషన్  సొసైటీ సిబ్బంది బాపు రెడ్డి  పాల్గొన్నారు.  

ఖైదీలకూ హక్కులు:  ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు హక్కులు ఉన్నాయని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సబిత తెలిపారు.  మంగళవారం జిల్లా కేంద్రంలోని జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల కోసం కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. వంటశాలను సందర్శించి.. ఖైదీలకు అందించే ఆహారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు.  ఈ సందర్భంగా  ఫ్రీ లీగల్ ఎయిడ్, ఫోక్సో యాక్ట్‌‌, లీగల్ సర్వీసెస్ యాక్టుల గురించి  ఖైదీలకు వివరించారు.  జైలులో వారు పొందాల్సిన హక్కులపై అవగాహన కల్పించారు.  ఆమె వెంట జైలు సూపరింటెండెంట్ నాగరాజ్, కోర్టు సూపరింటెండెంట్ దేవకి పాల్గొన్నారు.  


ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు: కొలరాడో వర్సిటీ  ప్రొఫెసర్  సాయి ప్రసాద్ గౌడ్

పెద్దమందడి, వెలుగు: ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయి ప్రసాద్ గౌడ్  సూచించారు. మంగళవారం ఆయన సొంతూరైన మండలంలోని మనిగిళ్ల జడ్పీహెచ్‌‌ స్కూల్‌‌ను సందర్శించారు. ఈ సందర్భంగా  విద్యార్థులు ఇష్టా గోష్టి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్‌‌గా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు.  కష్టపడి చదివి కొలరాడో వర్సిటీ ప్రొఫెసర్‌‌‌‌ వరకు ఎదిగానని విద్యార్థులకు వివరించారు.  అనంతరం మనిగిళ్ల పూర్వ విద్యార్థి బాల్ రెడ్డి  అందజేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థులను ఒక్కో అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగాలని కోరగా.. వాళ్లు అలాగే చేశారు.  అనంతరం టీచర్లు ఆయనను   సత్కరించారు.  ఈ కార్యక్రమంలో  హెచ్‌‌ఎం శంకర్ గౌడ్, టీచర్లు నాగేశ్వరమ్మ , విష్ణువర్ధన్, విజయ్ కుమార్, చంద్రకళ, సురేఖ పాల్గొన్నారు.

గట్టు నెల్లికుదురుకు రూ.30 లక్షలు:  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురు గ్రామ సమస్యల పరిష్కారానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ‘గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూల్’ లో భాగంగా మంగళవారం  గట్టు నెల్లికుదురులో పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని,  ఆసరా పింఛన్లు రావడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.  సమయానికి బస్సులు రాకపోవడంతో స్కూల్‌కు వెళ్లలేకపోతున్నామని  విద్యార్థులు వాపోయారు.  ‘సారు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వండి..  బతుకుతాం’ అని ఓ కాలనీకి చెందిన మహిళలు కోరారు.  స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ డిపో మేనేజర్ ఫోన్ చేసి బస్ టైమింగ్ మార్చాలని ఆదేశించారు.  సీసీ రోడ్ల కోసం  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్‌‌ ఈఈ మల్లారెడ్డిని ఆదేశించారు.  ఎమ్మెల్యే వెంట డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి ఉన్నారు. 


నేడు పీహెచ్‌సీ బిల్డింగ్ ఓపెన్: కలెక్టర్ కోయ శ్రీహర్ష

మాగనూర్, వెలుగు: మగనూర్ మండల కేంద్రంలో కొత్త నిర్మించిన పీహెచ్‌సీ బిల్డింగ్‌ బుధవారం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఓపెన్ చేయనున్నారని కలెక్టర్ కోయ శ్రీహర్ష చెప్పారు. మంగళవారం బిల్డింగ్‌ను పరిశీలించి.. అధికారులను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిన్నచిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసి..  ఆస్పత్రి పరిసరాలను నీట్‌గా ఉంచాలని సూచించారు.  అనంతరం ఊట్కూర్ మండలం పగిడిమారి ఎంపీయూపీఎస్‌ స్కూల్‌ను తనిఖీ చేసి.. రికార్డులను 
పరిశీలించారు.  

సార్‌‌..  అన్నంలో పురుగులొస్తున్నయ్

ఉప్పునుంతల(వంగూర్), వెలుగు:  అన్నంలో పురుగుల వస్తున్నాయని, మంచి ఫుడ్‌ పెట్టించాలని వంగూర్ మండలం పోల్కంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోరారు. మంగళవారం కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ స్కూల్‌ విజిట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా  విద్యార్థులు ‘సార్‌‌ అన్నంలో పురుగులొస్తున్నయ్.. దాన్ని తింటే  కడుపు నొప్పిలేస్తుంది’ అని మొరపెట్టుకున్నారు. దీంతో విద్యార్థులతో కలిసి స్టోర్ రూమ్ వద్దకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. అందులో పురుగులు ఉండడంతో వెంటనే కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్‌కి ఫోన్‌ చేసి సమస్య వివరించారు. నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని  కోరారు. ప్రభుత్వం ఫండ్‌ ఇస్తున్నా సివిల్ సప్లై అధికారులు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయకపోవడం ఏంటని మండిపడ్డారు.