అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

కామేపల్లి, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో పేదలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందని, తాము అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇల్లెందు ఎమ్మెల్యే  కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పింజరమడుగు గ్రామంలో పెండింగ్​లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ పాలకులు ప్రజా అవసరాలను గాలికి వదిలి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆరోపించారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. పెండింగ్​లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అన్నీ త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం గణేశ్ మండపాల్లో  ప్రత్యేక పూజలు చేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ‌మేకల మల్లిబాబు యాదవ్, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో రవీందర్ తదితరులు  పాల్గొన్నారు.