అధికారం పోగానే పోతున్నరు .. పదవుల కోసం పార్టీ మారుతున్నరు: కేటీఆర్

అధికారం పోగానే పోతున్నరు .. పదవుల కోసం పార్టీ మారుతున్నరు: కేటీఆర్
  • అప్పట్లో ఉద్యమంలో లేనోళ్లు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించిన్రు  
  • జీతాలు టైమ్​కు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైన్రు  
  • ప్రజలు మోసగాళ్లనే కోరుకుంటరు.. అందుకే కాంగ్రెస్​ను గెలిపించారని కామెంట్ 

ఆదిలాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘తొమ్మిదేండ్లు మంత్రులుగా పని చేసినోళ్లు, కేసీఆర్ దేవుడు అంటూ పొగిడిన పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు పదవుల కోసం పార్టీ మారుతున్నారు. ఇప్పుడు వెళ్లిపోతున్న నేతలు ఉద్యమంలో లేనివాళ్లే. వాళ్లు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలోకి వచ్చారు.. పదవులు అనుభవించారు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వెళ్లిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరూ లేరు.. ఆరోజు ఉన్నది మీరే.. ఈరోజు ఉన్నది మీరే’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఆదిలాబాద్ లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 

మోసపూరిత హామీలతో గెలిచిన్రు.. 

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని కేటీఆర్ విమర్శించారు. ‘‘ప్రజలు మోసగాళ్లనే కోరుకుంటారు.. అందుకే మోసం చేసే కాంగ్రెస్ నే గెలిపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం మాకు లేదు. వాళ్లు ఐదేళ్లు ఉండాలి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి” అని అన్నారు. ‘‘ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే కాంగ్రెసోళ్లు 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇది మందికి పుట్టిన బిడ్డలను మన బిడ్డలు అని  చెప్పుకోవడమే” అని కామెంట్ చేశారు. ‘‘మనం ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల మనసు గెలుచుకోలేకపోయాం. జీతాలు టైమ్ కు ఇవ్వకపోవడంతోనే ఇది జరిగింది. అప్పుడు ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగుల జీతాలు ఆపి.. రైతులకు రైతుబంధు, ఫించన్లు వంటివి అందించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు” అని చెప్పారు. 

బీజేపీకి బుద్ధి చెప్పాలి.. 

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ లీడర్లు గెలిచారు. అలాంటిది మేం ఎట్ల ఒక్కటవుతామో కాంగ్రెస్ సన్నాసులు చెప్పాలి” అని నోరుపారేసుకున్నారు. ‘‘బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాయం చేయాలని బీజేపీ చూస్తోంది. రాముడికి ఏ పార్టీలో సభ్యత్వం లేదు. అన్ని పార్టీలకు రాముడు దేవుడే. మోదీ దేవుడని బండి సంజయ్ అంటున్నడు. రైతులను ట్రాక్టర్లతో తొక్కించి చంపినందుకు దేవుడా? లేదంటే సిలిండర్లు, పెట్రోల్ ధరలు పెంచినందుకా?” అని ప్రశ్నించారు.