కు.ని మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

కు.ని మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి చనిపోయిన ఇద్దరు మహిళల కుటుంబాలకు చెరో రూ.50వేల సాయాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేటకు చెందిన లావణ్య , మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి నగదును అందించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

కాగా, ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై హెచ్ఆర్సీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ.. ఈ ఘటనపై అక్టోబర్ 10లోగా సమగ్ర నివేదికను అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఇటీవల వెల్లడించారు.