అధికారం పోయాక కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారు  : మందుల సామేల్ 

అధికారం పోయాక కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారు  : మందుల సామేల్ 

తుంగతుర్తి, వెలుగు : అధికారం పోయాక మాజీ సీఎం కేసీఆర్​కు రైతులు గుర్తుకొచ్చారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఎద్దేవా చేశారు. ఆదివారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేండ్లలో ఏనాడూ  రైతుల గురించి ఆలోచించని కేసీఆర్.. నేడు పంట పొలాలను పరిశీలించడం విడ్డూరంగా ఉందన్నారు.

గతేడాది వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట నష్టపోతే పరిహారం ఇవ్వని కేసీఆర్.. ​రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధికోసమే కేసీఆర్​ పంటపొలాలను పరిశీలిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నుంచి మోటార్ల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని, రైతులు పంట కోసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో భూదందాలు, ఇసుక దందాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పదేండ్లు పరిపాలన కొనసాగిందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా పూర్తి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని,  కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు యోగానందాచార్యులు. అభిషేక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదవ రెడ్డి, వెంకన్న, నాగరాజు, నర్సయ్య, నరసింహ పాల్గొన్నారు.