- డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రామడుగు/గంగాధర, వెలుగు: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం రామడుగు, గంగాధర మండలకేంద్రాల్లో పలు అభివృద్ధి, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రామడుగులో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు, గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లు అందజేశారు. అంతకుముందు మోడల్ స్కూల్ విద్యార్థులకోసం ఆర్టీసీ బస్సును కరీంనగర్ వర్క్‌షాప్ వద్ద ప్రారంభించారు. అధికారులు, లీడర్లతో కలిసి రామడుగు వరకు బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఓట్లు వేయడం వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, మహిళలకు అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. అనంతరం గంగాధరలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 4,916 స్వశక్తి సంఘాలకు రూ.4.76 కోట్ల విలువైన వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు.
నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర రైతువేదికలో మంగపేటకు చెందిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు మంగళవారం పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులకు ఇచ్చిన హామీని మర్చిపోకుండా సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 23.50 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.
