గుడి, బడి వ్యాఖ్యలకు వంద శాతం కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు

గుడి, బడి వ్యాఖ్యలకు వంద శాతం కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు

వరంగల్, వెలుగు: ‘బడి కడితే మేధావులు అవుతారు, విజ్ఞానం వస్తది. గుడికడితే బిచ్చగాళ్లు అయితరు’ అంటూ సోమవారం ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు మాట్లాడిన విషయం తెలిసిందే! దీంతో  మంగళవారం  బీజేపీ, హిందూ సంఘాలు పలుచోట్ల ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాగరాజు స్పందించారు. తాను మాట్లాడినదానికి వంద శాతం కట్టుబడి ఉంటానన్నారు. భక్తితో పాటు చదువు కావాలని, అప్పుడే ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అలా కాకుండా తనముందు కూర్చొని భజన చేయమని ఏ దేవుడు చెప్పలేదన్నారు. ‘చదువు ఉంటేనే సరైన విజ్ఞానం వస్తుంది’ అని అంబేద్కర్​ సైతం చెప్పాడన్నారు. 

ఇదే విషయాన్ని తాను చాలా సభలు, సమావేశాల్లో తెలియజేశానన్నారు. సోమవారం సైతం తాను పిల్లలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గం నుంచి చాలా మంది గుళ్లు కడుతున్నామని చందాలు రాయమని వస్తున్నారని.. ఈ క్రమంలో వారికి గుడి కాకుండా, పిల్లల భవిష్యత్​ కోరేలా ఎడ్యుకేషన్, బడిలో అవసరమైన సౌకర్యాలకు మాత్రమే సాయం చేస్తానని చెప్పనన్నారు. ఇక హిందుత్వం జోలికొస్తే.. తాను కరడుగట్టిన హిందూవాదినన్నారు. 

తన భార్య ఇంట్లో నిత్యం ఏదో ఒక పూజ చేస్తుందన్నారు. తమ తల్లిదండ్రులు శివుడి కంఠంలో ఉండే నాగరాజు పేరును తనకు పెట్టారన్నారు. గుడులు కడితే బిచ్చగాళ్లు అవుతారనే పదాన్ని కొందరు దొంగ స్వాములను ఉద్దేశించి అన్నానని.. దానిని వక్రీకరించడం సరికాదన్నారు. తాను హిందూ మతాన్ని, లేదంటే ఎవరినో కించపరచి.. మనోభావాలను దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. తనపై కామెంట్​ చేయడాన్ని అలా నిరసన తెలిపే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వెల్లడించారు.