బీజేపీలో విలీనం నిజం కాబట్టే.. కేటీఆర్‍ స్పందించట్లే : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

బీజేపీలో విలీనం నిజం కాబట్టే.. కేటీఆర్‍ స్పందించట్లే : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి
  • బీఆర్‍ఎస్‍ పార్టీని మైనార్టీలు నమ్మొద్దు 

వరంగల్‍, వెలుగు: బీజేపీలో బీఆర్‍ఎస్‍ని విలీనం చేసేందుకు ప్రయత్నించినది నిజం కాబట్టే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ స్పందించట్లేదని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన హనుమకొండలోని కాంగ్రెస్‍ భవన్ లో ప్రెస్‍మీట్‍ నిర్వహించి మాట్లాడారు. ఎంపీ సీఎం రమేశ్‍ తో  కేటీఆర్‍ కలవడంలో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్‍ చేశారు.  ఎట్టిపరిస్థితుల్లో బీఆర్‍ఎస్‍ ని మైనార్టీలు నమ్మొద్దని సూచించారు.  రెండో రాజధానిగా ఓరుగల్లు అభివృద్ధిపై కాంగ్రెస్‍ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎయిర్‍పోర్ట్ భూసేకరణకు  రూ.205 కోట్లు విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. వరంగల్‍ సిటీతో పాటు  పశ్చిమ సెగ్మెంట్ పై కాంగ్రెస్‍ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై కేటీఆర్‍ చర్చకు రావాలని ఆయన డిమాండ్‍ చేశారు. 

వారికంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. సిటీలో డబుల్‍ ఇండ్లను అభివృద్ధి పనుల్లో కోల్పోయినవారికి, వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ముందుగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 10 ఏండ్లలో సిటీ అభివృద్ధిని పట్టించుకోని దాస్యం బ్రదర్స్ లో  ఒకరు కేటీఆర్‍తో, మరొకరు కవితతో తిరుగుతున్నారన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‍, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‍, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‍ అజీజ్‍ఖాన్‍, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్‍, జక్కుల రవీందర్‍, వేముల శ్రీనివాస్‍ తదితరులు పాల్గొన్నారు.