తన భర్త క‌నిపించ‌డం లేదంటూ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు

తన భర్త క‌నిపించ‌డం లేదంటూ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు
  • మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా నాటకీయ పరిణామాలు

మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. శివసేన అగ్రనేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో 30మందికిపైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో అసంతృప్త ఎమ్మెల్యేలందరూ గుజరాత్ రాష్ర్టానికి తరలివెళ్లారు. మంత్రి ఏక్ నాథ్ షిండేతో వెళ్లినవారిలో శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ (బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం) కూడా ఉన్నారు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ భార్య ప్రాంజలి... అకోలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేసింది. జూన్ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో ఫోన్ కాల్‌లో చివరి సారిగా మాట్లాడానని, ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అనారోగ్యంతో ఉన్నారని ఫిర్యాదు చేయడంతో సూరత్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

బీజేపీపై ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ‘మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలలో మాదిరిగానే పడగొట్టడానికి కుట్ర జరుగుతోంది’ అని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ అన్ని విధాలుగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.