మెదక్లో తెరవెనక వ్యూహకర్తలు

మెదక్లో తెరవెనక వ్యూహకర్తలు
  • భార్య కోసం భర్త...  కొడుకు కోసం తండ్రి     
  •  గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు

మెదక్, వెలుగు: మెదక్ అసెంబ్లీ స్థానంలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్టుగా మారింది. అధికార పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ద్వారా నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్​అభ్యర్థి మైనంపల్లి రోహిత్​ రావు​ తొలి ప్రయత్నంలోనే గెలుపొంది సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

పద్మ గెలుపు కోసం దేవేందర్​ రెడ్డి

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గెలుపు కోసం ఆమె భర్త, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా ప్రచారంలో ఎక్కువగా పాల్గొనకుండా తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు వివిధ కారణాలతో అసంతృప్తితో ఉన్న  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో స్వయంగా మాట్లాడుతున్నారు. వారిని సముదాయించి ఇకముందు అన్ని విషయాల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తూ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేసేలా చూస్తున్నారు.

మరోవైపు పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీని బలహీన పర్చడంపై స్పెషల్ ఫోకస్​ పెట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్​రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్​లో చేరడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్​ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు బీఆర్ఎస్​లోకి వచ్చేలా చూస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల్లో పద్మ గెలుపు బాధ్యతను దేవేందర్​రెడ్డి తీసుకుని వ్యూహాత్మంకగా ముందుకు సాగుతున్నారు.

కొడుకు కోసం అన్నీ తానై  

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ రావు​ పోటీచేస్తున్నారు. అయితే ఆయన ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేయడం, మొదటిసారి అసెంబ్లీ బరిలో దిగడంతో ఆయన గెలుపు బాధ్యతను తండ్రి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు తన భుజాన వేసుకున్నారు. ఆయన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ మెదక్ పై ప్రత్యేక దృష్టి సారించారు. కొడుకు రోహిత్​ను ఎమ్మెల్యే చేయాలన్న ఆకాంక్షతో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించగా పార్టీ హైకమాండ్​ అవకాశం ఇవ్వలేదు.

దీంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి  హస్తం పార్టీలో చేరారు. తన కొడుకుకు ఫస్ట్​లిస్ట్​లోనే కాంగ్రెస్​  టికెట్ సాధించడంతో సక్సెస్​ అయ్యారు. అదే ఉత్సాహంతో ఎన్నికల్లో రోహిత్ ను గెలిపించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అటు మల్కాజ్ గిరిలో ప్రచారం చేస్తూనే, వీలైనప్పుడల్లా  మెదక్ నియోజకవర్గంలో  పర్యటిస్తున్నారు.  కాంగ్రెస్​ బలోపేతానికి, నాయకుల మధ్య సమన్వయానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన వారితో స్వయంగా ఫోన్​లో మాట్లాడుతూ మద్దతు కూడగడుతున్నారు.