వడ్ల టెండర్లలో రూ. 750 కోట్ల కుంభకోణం: పాయల్ శంకర్

వడ్ల టెండర్లలో రూ. 750 కోట్ల కుంభకోణం: పాయల్ శంకర్
  •   బీజేపీ ఎమ్మెల్యే పాయల్  శంకర్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ శాసన సభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆరోపించారు. ఆయన పార్టీ అధికార ప్రతినిధులు సంగప్ప, విఠల్, మురళీధర్ గౌడ్ తదితరులతో కలిసి శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. 35 లక్షల టన్నుల వడ్ల టెండర్​లో రూ.750 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియ నిర్వహించిన విధానమే ఈ అనుమానాలకు కారణమన్నారు. ఎక్కువమంది బిడ్డింగ్ లో పాల్గొంటే వాళ్ల అక్రమాలకు తావుండదనే ఉద్దేశంతో.. కండిషన్లు పెట్టి చాలామంది మిల్లర్లను బిడ్డింగ్ లో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. 

సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తం

90 రోజుల్లోగా రూ. 7,250 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చెల్లించి 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లర్ల  నుంచి తీసుకెళ్తామన్న బిడ్డర్లు.. గడువు దాటినా తీసుకుపోలేదని పాయల్ శంకర్ అన్నారు. అయినా బిడ్డర్లకు ప్రభుత్వం కనీస ఫెనాల్టీ వేయలేదని, వాళ్లు కట్టిన డిపాజిట్​నుకూడా జప్తు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత పెట్టి వడ్లు కొనుగోలు చేసిందో వాళ్ల దగ్గరున్న స్టాక్ కు అంత మొత్తం డబ్బు చెల్లిస్తామని మిల్లర్లు చెప్పినా సర్కారు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యక్తులు ఇప్పటివరకు 10 లక్షల టన్నుల ధాన్యం కూడా లిఫ్టు చేయలేదన్నారు. వడ్ల కొనుగోలు టెండర్లలో అవకతవకలపై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తామని, కుంభకోణంపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేయాలని పార్టీ నిర్ణయించిందని శంకర్ చెప్పారు.