
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈడీ ఆయనను ప్రశ్నించింది. విచారణ ముగిశాక బయటకు రాగానే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు తనను కేవలం బయోడేటా గురించి అడిగారని స్పష్టం చేశారు. విచారణ కోసం మళ్లీ రేపు ఉదయం 10.30 కి రమ్మని చెప్పారని వెల్లడించారు. ‘‘నన్ను ఎందుకు విచారణకు పిలిచారు ? ఏ కేసులో విచారించేందుకు పిలిచారు ? అనేది చెప్పమని అడిగితే.. ప్లీజ్ కోఆపరేట్ విత్ అజ్ అని ఈడీ అధికారులు బదులిచ్చారు” అని వివరించారు. అంతేతప్ప ఈడీ అధికారులు తనకు సరైన సమాధానం చెప్పలేదన్నారు. దీని పై రేపు లీగల్ ఒపీనియన్ తీసుకుంటానని రోహిత్ స్పష్టం చేశారు. తాను మాత్రం ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పానని తెలిపారు.
‘‘ఆధార్ కార్డు, పాస్ పోర్టులు వాళ్లకు సబ్మిట్ చేశాను. ఇంకొన్ని డాక్యుమెంట్లు అడిగారు.. అవి కూడా రేపు తెచ్చిస్తానని చెప్పాను” అని రోహిత్ రెడ్డి చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎంతమంది వచ్చి ప్రశ్నలు అడిగినా ఓపికగా జవాబులు చెప్పానని ఆయన వివరించారు. “ఈ విచారణ ఎందుకు జరుగుతోందో అంతుపట్టడం లేదు. ఇవాళ నన్ను వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు, వ్యాపార వివరాలను మాత్రమే అడిగారు. మనీలాండరింగ్ కు సంబంధించిన ప్రశ్నలేం అడగలేదు. ఏ కేసుకు సంబంధించిన వివరాలను కూడా అడగలేదు”అని తెలిపారు.