హరీష్రావుపై కేసులు నమోదు చేయాలి : రఘునందన్​రావు

హరీష్రావుపై కేసులు నమోదు చేయాలి : రఘునందన్​రావు

సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘటనలో మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీకి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు దశాబ్దాల కలను నిజం చేశారని చెప్పారు. హుందాగా ప్రవర్తించాల్సిన మంత్రి హరీష్ రావు రైల్వేస్టేషన్ ను తన సొంత ఆస్తిలా, బీఆర్​ఎస్​ పార్టీ మీటింగ్ లా వ్యవహరించారని, మిగతా వారిని కూడా అగౌరవ పరిచారని చెప్పారు. 

పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసి తనకు తాను ఈమేజీ తగ్గించుకున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి ప్రవర్తించారని ఆరోపించారు. 24 గంటలు దాటినా పోలీసులు ఇప్పటి వరకు ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదన్నారు. పోలీసులు వారి గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పారు. మంత్రి హరీష్ రావు Led స్క్రీన్ ను తన్నడం, తిట్టడం వారి సంస్కారానికి నిదర్శనం అయితే మంచి పద్దతి కాదన్నారు. బీఆర్​ఎస్​ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుంటే దాన్ని ప్రజలపై చూపెట్టకూడదన్నారు.

మంత్రి స్థాయిని తగ్గించుకోవద్దన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మోదీ బొమ్మను చింపమని చెప్పడం సరికాదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో సుజాత గెలిస్తే రూ. 500 కోట్లతో అభివృద్ధి చేసేవాడిని అని హరీష్ రావు మాట్లాడడం సభ్యత కాదన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలవలేదనీ, అందుకే డబ్బులు ఇవ్వడం లేదనడం మంత్రికి తగదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసినపుడు అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తామని చెబుతారని చెప్పారు.

ప్రధాని మోదీ కూడా హరీష్ రావులా ఆలోచిస్తే ఇక్కడ అభివృద్ధి జరిగేదా..? రైలు వచ్చేదా..? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులు గెలిస్తే నిధులు ఇవ్వరా..?  ఎంత ధైర్యం మీకు..? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు చేస్తున్న తప్పులను ప్రజలందరూ చూడాలన్నారు. కేంద్రాన్ని విమర్శించే హక్కు కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు. సిద్దిపేటలోని ప్రతి చౌరస్తాలో హరీష్​ రావు ప్రవర్తనపై చర్చ జరగాలన్నారు. ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, అతని పీఏలపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సీనియర్ రైల్వే అధికారిని బెదిరించడం సరికాదన్నారు. అది మీకు సంస్కారం కాదని చెప్పారు. 2006లో రైల్వే బడ్జెట్ లో రూ.350 కోట్లు ప్రకటించి.. తట్టెడు మట్టి తీయకపోతే.. తామే 2023లో వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. ఏ కార్యక్రమానికి మంత్రి రాకున్నా.. ఆయన పేరు శిలాఫలకంపై పెట్టిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యే పేర్లను శిలాఫలకంపై లేకుండా చూస్తున్నారని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో హరీష్ రావుపై బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేయాలన్నారు.