ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ (చేగుంట), వెలుగు: ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలో వైద్య సేవలు ఇంత అధ్వానంగా ఉంటాయా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలం పెద్ద శివనూర్ లో అతిసార వ్యాధి ప్రబలి 50 మంది అస్వస్థతకు గురి కాగా, నల్ల పోచయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారిని గ్రామ పంచాయతీ ఆఫీస్ లో నేలపై పడుకోబెట్టి సెలైన్  ఎక్కించడం చూసి డీఎంహెచ్ వో  విజయ నిర్మల,  చేగుంట పీ హెచ్ సీ డాక్టర్ పుష్పలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాఖ వద్ద డబ్బులు లేకపోతే తన జీతం డబ్బుల నుంచి అవసరమైన పరికరాలకు డబ్బులు ఇస్తానన్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు ఎంతో మెరుగు పర్చామని చెబుతున్న ఆరోగ్యశాఖ మంత్రి ఆయన సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉండటమేంటని ప్రశ్నించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే అంబులెన్స్ ఏర్పాటు చేసి మెదక్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ, దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట చేగుంట జడ్పీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రామచంద్రం, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేశ్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్ ఉన్నారు.


దాచారం గుట్ట తవ్వకాల పరిశీలన 

కొమురవెల్లి, వెలుగు:  కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి సమీపంలోని దాచారం గుట్ట తవ్వకాలను స్థానిక తహసీల్దార్ లక్ష్మీనారాయణతో  కలిసి మైనింగ్​శాఖ రాయల్టీ ఆర్ఐ జ్యోతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాసారం గుట్టను అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేయడంతో పరిశీలించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా గట్టను తవ్వితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
బీజేపీ, సీపీఎం నాయకుల వినతులు
దాచారం గుట్టపై కొంత మంది రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతున్న దానిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అడిషినల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై బీజేపీ నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. 

రోడ్డు వేయడం లేదని బీజేపీ లీడర్ల నిరసన
కోహెడ(బెజ్జంకి), వెలుగు : మండల పరిధిలోని గాగిళ్లపూర్​ స్టేజీ నుంచి దాచారం మీదుగా ఎల్లంపల్లి మోడల్​ స్కూల్​ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 2014లో రూ.2.85లక్షలతో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. కానీ ఇప్పటికీ రోడ్డు వేయలేదని గురువారం బీజేపీ నాయకులు శిలాఫలకం వద్ద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రాజు మాట్లాడుతూ సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే రసమయి మునుగోడులోని ఉప ఎన్నిక ప్రచారంలో ఇక్కడి నిధులను మళ్లించి అక్కడ అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. గుంతల రోడ్లపై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డును నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీసుల సైకిల్ ర్యాలీ 

కంది/జహీరాబాద్, వెలుగు :  పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైకిల్​ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ  సైకిల్​ ర్యాలీ ప్రారంభించారు. ఎస్పీ కూడా సైకిల్ తొక్కారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఐబీ వరకు సైకిల్ ర్యాలీ  కొనసాగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ ఉషావిశ్వనాథ్, డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు శివలింగం, మహేశ్​గౌడ్, ఆర్ఐలు కృష్ణ, డానియెల్, ఎస్సై యాదవరెడ్డి పాల్గొన్నారు.
జహీరాబాద్ లో.. 
జహీరాబాద్ పట్టణంలో డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్, జహీరాబాద్ రూరల్, చిరాక్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఆయుధాల పనితీరు, పోలీసులు చట్టాలపై అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో సీఐ తోట భూపతి, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్, కాశీనాథ్, పోలీసులు పాల్గొన్నారు. 

అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్​దే.. 
జోగిపేట, వెలుగు :  బంగారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. మిగులు బడ్జెట్‌‌ రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయ్యిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణతో కేసీఆర్​ ఒక్క కుటుంబానికే మేలు జరిగిందని ఆరోపించారు. గురువారం అందోలు మండలం డాకూర్, జోగిపేటలో వేర్వేరుగా జోడోయాత్ర సన్నాహక కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. ఇందులో బెల్టు షాపుల ద్వారానే రూ.16 వేల కోట్లు వస్తుందంటే గ్రామాల్లో ఏ మేరకు మద్యం ఏరులైపారుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ వైఫల్యాలను, కాంగ్రెస్‌‌ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాహుల్‌‌ గాంధీ చేపట్టిన భారత్‌‌ జోడో యాత్ర జాతర కావాలని, వచ్చే నెల 3న నియోజకవర్గంలోకి  ప్రవేశిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మార్కెట్‌‌ చైర్మన్‌‌ ఎం.పద్మనాభరెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్‌‌ జోగిరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌‌ ఎం.జగన్మోహన్‌‌రెడ్డి,  పీఏసీఎస్‌‌ చైర్మన్‌‌ నరేందర్‌‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్‌‌ కౌన్సిలర్లు సురేందర్‌‌గౌడ్ పాల్గొన్నారు.

యాత్రను సక్సెస్ చేయాలి
కంగ్టి, వెలుగు : భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయాలని టీపీసీసీ మెంబర్ డాక్టర్​ సంజీవ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆయన వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి పి.చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచులు పల్లవి పరశురాం, సురేఖ వెంకట్, లక్ష్మి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు. 
 

16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ 
13. 35 లక్షల నగదు, 17 మొబైల్స్ సీజ్ 

రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రాత్రి 16 మంది పేకాట రాయుళ్లను రామచంద్రపురం పోలీసుల సహాయంతో మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. కొల్లూర్​కు  చెందిన కాంగ్రెస్​ నేత రాజు గౌడ్​కు  చెందిన ఫాంహౌస్ లో వీరా రెడ్డి అనే వ్యక్తి పేకాట స్థావరం నిర్వహిస్తున్నాడనే పక్కా సమాచారంతో దాడులు చేశారు. కొల్లూర్, నాగులపల్లి, శంకరపల్లి, గజ్వేల్, గండిపేట తదితర ప్రాంతాలకు చెందిన 16 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.  రూ. 13 లక్షల 35 వేల 540, 17 సెల్ ఫోన్లు, 20 సెట్ల కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న రాజు గౌడ్​ లలో మీడియా ప్రతినిధులతో  దురుసుగా ప్రవర్తించాడు. దీంతో రిపోర్టర్లు రాజుగౌడ్​పై ఆర్సీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పార్టీ గీత దాటితే చర్యలు తప్పవు: బీజేపీ మెదక్​ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్
తూప్రాన్, వెలుగు : పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైనా సహించేది లేదని బీజేపీ మెదక్​ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులు యాదవ్ హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తూప్రాన్ మండల అధ్యక్షుడు సిద్ధిరాములు యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఆయన తూప్రాన్ లో విలేకరులతో మాట్లాడారు. సిద్ధిరాములు కొంత కాలంగా పార్టీలో ఉంటూ అధికార పార్టీకి తొత్తుగా మారి మాట్లాడుతున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంఖ్యా యాదగిరి, నాయకులు రఘుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఆరోగ్య సంరక్షణపై ఆశా కార్యకర్తలకు శిక్షణ
సిద్దిపేట రూరల్, వెలుగు : ఆశా కార్యకర్తలు గ్రామస్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ సూచించారు. గురువారం సిద్దిపేటలోని ఎన్జీవో భవన్ లో  జిల్లాలోని ఆశా కార్యకర్తలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శిక్షణ శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డీటీటీ పీవో డాక్టర్​ వినోద్ బాబ్జీ తో కలసి మాట్లాడారు.  సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శిక్షణ ద్వారా నేర్చుకున్న విషయాలను గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శిక్షణ మూడు రోజులు కొనసాగుతుందన్నారు.