కత్తులను నమ్ముకోలే.. ఓట్లు, ప్రజలను నమ్ముకున్నా; రఘునందన్​రావు

కత్తులను నమ్ముకోలే.. ఓట్లు, ప్రజలను నమ్ముకున్నా; రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: కత్తులను నమ్ముకునే సంస్కృతి కాదని, రాజ్యాంగం కల్పించిన ఓట్లు, చట్టాలు, ప్రజలను నమ్ముకుని ప్రజాక్షేత్రంలో ముందుకు వెళుతున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. ఆదివారం మండలంలోని లచ్చపేట, ఆకారం, రఘోత్తంపల్లి, గోసాన్​ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డిపై జరిగిన కత్తి తాడి బీజేపోల్లే చేశారని, గ్రామాల్లో సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాను ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకునే వ్యక్తినని, కత్తులతో దాడులు చేయించే సంస్కృతి తన ఇంటా వంటా లేదన్నారు. ప్రభాకర్​రెడ్డి రెండు సార్లు ఎంపీగా గెలిచాడని, ఎనగుర్తి, బొప్పాపూర్, ఆకారం, రఘోత్తంపల్లి, గోసాన్​ పల్లి గ్రామాల మీదుగా వెళ్తున్న గుంతల మయమైన రోడ్డును ఏనాడైనా పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ ఇంటికో ఉద్యోగం, దళిత బంధు,  బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకం ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. బీఆర్ఎసోళ్లు చెప్పే మాయ మాటలకు  మళ్లీ మోసపోకుండా మరొక్కసారి బీజేపీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.