
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 పై బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే రీతిలో ప్రచారం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఎక్కడా కూడా తప్పుపట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండని, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చేతల్లో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు.
బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్లపాటు అధికారంలో ఉండి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందని.. అలాంటి వారు గ్రూప్ 1పై మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గ్రూప్ 1 పై ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇస్తుందని, ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాటలు నమ్మి నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.