
అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు . డిసెంబర్ 9వ తేదీ శనివారం నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎంఐఎం రజాకార్ల పార్టీ అని, అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే.. తాను ప్రమాణం చేయనని అన్నారు. రేపు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఉందని.. ఈ విషయంపై ఆయనతో చర్చించి తన తుది నిర్ణయ చెబుతానని అన్నారు. 2018లోనూ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించిన ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ సమక్షంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాణం చేయలేదు.
డిసెంబర్ 9వ తేదీ ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు.