బండి సంజయ్ని కలిసిన రాజాసింగ్ సతీమణి

బండి సంజయ్ని కలిసిన రాజాసింగ్ సతీమణి

ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఉషాబాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం ఇదే తొలిసారి. రాజాసింగ్ ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ తరఫున సాయం అందించాలని ఆమె కోరారు. తన భర్తపై పార్టీపరంగా విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నందు వల్లే తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని రాజా సింగ్ భార్య ఈసందర్భంగా పేర్కొన్నారు.

రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే బండి సంజయ్ లేఖ రాశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  పార్టీపరంగా రాజాసింగ్ కు న్యాయ సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈనేపథ్యంలో త్వరలోనే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉందని సమాచారం. ఇక ఇప్పటికే పార్టీ తరఫున రాజాసింగ్ కు రఘునందన్ రావు, రామచంద్రరావు న్యాయ సహాయం అందిస్తున్నారు.  బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇప్పటికే  ఎమ్మెల్యే రాజా సింగ్ వివరణ ఇచ్చారు.