
బీఆర్‌ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడున్నా.. ఆ సందడే వేరు. కిందపడినా తన పట్టుదల వీడరు. ధర్మసాగర్ మండలంలో సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా పంచెకట్టులో కబడ్డీ కోర్టులోకి దిగి సవాల్ విసిరారు రాజయ్య. తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్కడికి వచ్చినవారిలో జోష్ నింపారు.
యువతతో పోటీ
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏం చేసినా హైలేట్. నిత్యం ఏదో రకంగా ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సరదాగా ఆడుతూ.. పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ అందరి అటెన్షన్ తనపైపు తిప్పుకుంటారు. తనకు తానే సాటి అని నిరూపిస్తాడు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. రాజయ్యలో జోష్ మాత్రం తగ్గటంలేదు. ఇప్పటికీ.. యువతతో పోటీ పడే చలాకీతనం ఆయనది. తాజాగా యువకులతో కలిసి కబడ్డీ ఆడారు. బాక్సింగ్ గ్లౌవ్స్ ధరించి ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపించారు.క్రీడలు మానసికంగా దృఢంగా దోహదపడతాయన్నారు ఎమ్మేల్యే రాజయ్య. ప్రతి క్రీడాకారుడు తన ఓటమిని గెలుపునకు తొలిమెట్టుగా తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులందరూ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు..
కబడ్డీ.. కబడ్డీ...
సీఎం కప్ క్రీడలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాజయ్య ధర్మసాగర్ వెళ్లారు. అక్కడ పోటీలను ప్రారంభించిన ఆయనకు.. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో ఏమో.. పంచె పైకి ఎగ్గట్టి కబడ్డీ బరిలో దిగారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ యువత, పోలీసులతో పోటీ పడ్డారు. అయితే కబడ్డీ ఆడే క్రమంలో రాజయ్య కిందపడిపోయారు. డీసీపీ ఏంఏ బారీని ఔట్ చేసేందుకు రైడ్‌కు వెళ్లిన ఆయన.. డీసీపీ తన పంచెను పట్టిలాగటంతో ఆకస్మాత్తుగా కిందపడిపోయారు. కిందపడినా.. ఏ మాత్రం తగ్గక.. వెనక్కి తిరిగి వచ్చి డీసీపీని అవుట్ చేశారు. కబడ్డీతో పాటు వాలీబాల్, బాక్సింగ్ కూడా ఆడారు రాజయ్య. బాక్సింగ్ గ్లవ్స్ ధరించి ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించారు.