డబుల్ ఇండ్లు బీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నరు : రాజాసింగ్

డబుల్ ఇండ్లు బీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నరు : రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినవారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తన నియోజకవర్గంలో  500 మందికి డబుల్ ఇండ్లు ఇస్తే  అందులో సగానికి పైగా పబ్లిక్ కు సొంత ఇండ్లు ఉన్నాయని తెలిపారు. అర్హత లేకున్నా వారికి ఎలా  ఇండ్లు ఇచ్చారని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గోషామహల్ నియోజకవర్గంలో 18వేల మంది అప్లికేషన్ పెట్టుకుంటే 500 మందికి ఇండ్లు ఇచ్చారని రాజాసింగ్ అన్నారు. అవి కూడా పేదలకు కాకుండా అనర్హులకు, సొంత పార్టీ నేతలకే  ఇస్తున్నారని  వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్, అధికారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 

దళిత, బీసీ, మైనారిటీ బంధులో ఎమ్మెల్యే చెప్పిన వారికి ఇస్తున్నపుడు, ఈ స్కీమ్  అలా ఎందుకు అమలు చేయడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. ఇండ్ల నిర్మాణంలో కేంద్రం నిధులు ఇచ్చినా వాటి మీద పీఎం ఆవాస్ యోజన లోగోకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని నిలదీశారు. స్టేజ్ ల మీద పీఎం అవాస్  పేరు సీఎం, మంత్రులు, అధికారులు ఎందుకు ప్రస్తావించటం లేదని మండిపడ్డారు.  2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో  2లక్షల ఇండ్లు కూడా కట్టలేదని గుర్తుచేశారు.  ఎన్నికలు వస్తున్నందున్నా  పబ్లిక్ ను మభ్య పెట్టడానికి ఇప్పడు ఇండ్ల పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్దిలో కేంద్రం పాత్ర చాలా ఉందన్నారు. రాష్ట్రాన్ని మత్తుల తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో  కేసీఆర్ పనిచేస్తున్నారని  రాజాసింగ్  విమర్శిచారు.