లక్షల జీతాలు తీసుకుంటుండ్రు.. పని చేయరా? .. తానూర్ పీహెచ్సీ డాక్టర్కు ఎమ్మెల్యే వార్నింగ్

లక్షల జీతాలు తీసుకుంటుండ్రు.. పని చేయరా? .. తానూర్ పీహెచ్సీ డాక్టర్కు ఎమ్మెల్యే వార్నింగ్
  • ఇష్టం వచ్చినట్లు డ్యూటీ చేస్తామంటే కుదరదు

భైంసా, వెలుగు:  లక్షల జీతాలు తీసుకుంటుండ్రు.. ఇష్టం వచ్చినట్లు డ్యూటీ చేస్తామంటే కుదరదు.. రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాల్సిందేనంటూ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఫైర్​అయ్యారు. శనివారం తానూర్ పీహెచ్​సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పీహెచ్​సీలో రోగులు ఉన్నప్పటికీ డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే వెంటనే ఫోన్ ​చేయించి డాక్టర్​ను పిలిపించారు. ‘అసలే వర్షాకాలం.. ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో తెలియదు.. రోగులకు అందుబాటులో లేకపోతే ఎలా.. విధులు సక్రమంగా నిర్వహించక పోతే ఎలా’ అంటూ మండిపడ్డారు.

 అక్కడి డీఎంహెచ్​వో రాజేందర్​కు ఫోన్ ​చేసిన ఎమ్మెల్యే..​ సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రోజు 9 గంటలకు విధులకు హాజరుకావాలని హెచ్చరించారు. అంతకు ముందు హాస్పిటల్​లోని పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరిం చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక బీజేపీ లీడర్లున్నారు.