పోటీపడి అప్పులపాలు కావొద్దు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

పోటీపడి అప్పులపాలు కావొద్దు :  ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  •     అభివృద్ధి కోసం ఏకగ్రీవాలకే ప్రాధాన్యతనివ్వండి 
  •     ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

కారేపల్లి, వెలుగు : స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో పోటీలు పడి అప్పుల పాలు కావొద్దని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచించారు. మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ఏకగ్రీవాలకే ప్రాధాన్యతనివ్వాలని, పోటీలు పడి సాధించేది ఏమీ లేదని చెప్పారు. 

గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూర్చుని మాట్లాడుకోవాలని , అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకుంటే ఆదర్శంగా నిలుస్తారన్నారు. రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేని ఈ ఎన్నికల పట్ల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమన్వయంతో అన్ని పార్టీల నాయకులు వ్యవహరించాలని సూచించారు. 

వైరా నియోజకవర్గంలోని చైతన్యవంతమైన గ్రామాలు కూడా కొన్ని ఏకగ్రీవం అయ్యాయని వాటిని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ఏకగ్రీవంగా జరిగే విధంగా మాట్లాడుకోవాలని చెప్పారు. భవిష్యత్​లో ఎన్నో నామినేటెడ్ పదవులు అందుబాటులోకి వస్తాయని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాటిని దృష్టిలో పెట్టుకొని పోటీలు పడకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, బానోతు రామ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి టోనీ, భీముడు, భద్రూ నాయక్, మేదరి రాజా, పొలగాని శ్రీనివాసరావు, సంతోష్, ఈశ్వరిబాయి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.