100 కార్లతో రేవంత్ ను కలిసిన సీతక్క 

100 కార్లతో రేవంత్ ను కలిసిన సీతక్క 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. మంగళవారం ఆమె పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ములుగు నుంచి వంద వాహనాల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కు వచ్చి రేవంత్ ను కలిశారు. జిల్లా కార్యకర్తలను పరిచయం చేశారు. రేవంత్ పీసీసీగా ఎంపికైన సందర్భంగా మొన్న సమ్మక సారలమ్మలను దర్శించుకున్న సీతక్క.... అక్కడి నుంచి తెచ్చిన దారాన్ని రేవంత్ కు కట్టారు. నియోజకవర్గం పనుల్లో బిజీగా ఉండటం వల్లే..... రేవంత్ కు పీసీసీ అప్పగించినప్పటి నుంచి కలవలేకపోయానన్నారు.

ఇవాళ వీలు దొరకడంతో రేవంత్ ను కలిసి సన్మానించానన్నారు సీతక్క. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరాంకానీ.. అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదన్నారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దని.. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల నేతలు, కార్యకర్తలతో రేవంత్ క్యాంప్ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం కొనసాగుతోంది.