అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట, వెలుగు:  అర్హులైన పేదలందరికీ రేషన్​కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవితో కలిసి రేషన్​కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను చేపట్టిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. 

మెదక్ జిల్లాలో 9,960 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, సుమారుగా 34 వేల కుటుంబాలకు రేషన్ కార్డులో పేర్లు నమోదు చేశామని చెప్పారు. గతంలో మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు రాక ఇబ్బందులు పడ్డ వారిని కూడా గుర్తించి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ పెద్దశంకరంపేట పీహెచ్​సీని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్, ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. వ్యాధుల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని  అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.