ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ములుగు, వెలుగు: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. శుక్రవారం ములుగు పీఏసీఎస్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. మిల్లర్లు కోత విధిస్తే, ఆఫీసర్లు తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పీఏసీఎస్​చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, డీసీవో సర్దార్ సింగ్ తదితరులున్నారు.

ముగిసిన సైన్స్ ఫెయిర్..

ములుగు మండలం బండారుపల్లి మోడల్ స్కూల్ లో మూడ్రోజుల పాటు సాగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ శుక్రవారం ముగిసింది. చీఫ్ గెస్టుగా సీతక్క హాజరై, ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్టూడెంట్లు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. డీఈవో జి.పాణిని, డీఎస్​వో ఎ.జయదేవ్ తదితరులున్నారు.

నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు?

ములుగు, వెలుగు: గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా అమలు చేయడం లేదని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇటు నిరుద్యోగ భృతి అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, మండలాధ్యక్షుడు రాకేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేశ్ రెడ్డి తదితరులున్నారు.

రుణమాఫీ అమలు చేయాలి..

బచ్చన్నపేట: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లా బచ్చన్నపేటలో తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు. అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. కొంతమందికే చేసి చేతులు దులుపుకొన్నాడని విమర్శించారు. ఫసల్ బీమాను అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడని మండిపడ్డారు.

ధరణిని రద్దు చేయాలి..

తొర్రూరు: రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న ధరణి పోర్టల్​ను రద్దు చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరు పట్టణంలోని తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. రైతులకు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమ లు చేయాలన్నారు. రైతులు పండించిన వడ్లను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు.


జీసీసీ సెంటర్ తనిఖీ

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: ములుగు జిల్లా పస్రా మండలంలోని గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ షాపుల్ని కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ తనిఖీ చేశారు. లబ్ధిదారులకు బయోమెట్రిక్ పనిచేయకుంటే ఐరిష్  యంత్రాన్ని ఉపయోగించి సరుకులు పంపిణీ చేయాలన్నారు. పేదలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం మండలంలోని మొద్దులగూడెంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద మంజూరైన రూ.50లక్షల విలువగల మినీ రైస్​మిల్ ​యూనిట్​ను కలెక్టర్ ప్రారంభించారు. గోవిందరావుపేట తహసీల్దార్​రాజ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ ​తదితరులున్నారు.


గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

జనగామ అర్బన్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ఆఫీసర్లు నిబద్ధతతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్​లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లిప్రగతిలో భాగంగా నిర్మించిన విలేజ్ పార్కులు,సెగ్రిగేషన్​షెడ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. హరితహారం మొక్కలను సంరక్షించాలని, క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తేవాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, డీఎల్పీవో పార్థసారథి, కోఆర్డినేటర్ కరుణాకర్ తదితరులున్నారు.

కొనసాగుతున్న పోలీస్​ ఈవెంట్స్

హనుమకొండ, వెలుగు: పోలీస్ ఉద్యోగాల నియా మకం కోసం కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్​ లో నిర్వహిస్తున్న ఈవెంట్స్ రెండో రోజూ కొనసాగాయి.  శుక్రవారం నిర్వహించిన టెస్టులకు 802 మందికిగానూ 665 మంది హాజరయ్యారు. వీరిలో 305 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్​ఈవెంట్స్​ నిర్వహిస్తున్న తీరు ను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ఏఆర్ అడిషనల్​ డీసీపీలు సంజీవ్, సురేశ్​ కుమార్​ ఉన్నారు. 


అంబరాన్నంటిన ‘పంబా ఆరట్టు’
నర్సంపేట, వెలుగు: నర్సంపేటలో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప పంబా ఆరట్టు వేడుకలు అంబరాన్నంటాయి. అయ్యప్ప మాలను ధరించిన స్వాముల శరణుగోషతో పట్టణం మారుమోగింది. శబరిమలలో నిర్వహించినట్లుగానే ఇక్కడా పంబా ఆరట్టు వేడుకలు జరిగాయి. ఉదయం అయ్యప్ప స్వామి టెంపుల్​లో  నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే దంపతులు పెద్ది 
సుదర్శన్​రెడ్డి, పెద్ది స్వప్న దంపతులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది కుమారుడు నిదర్శన్​ రెడ్డి మణికంఠ స్వామి ఉత్సవ విగ్రహాన్ని నెత్తిన 
పెట్టుకుని  చతురంగ బలాలతో ఊరేగింపుగా మాధన్నపేట పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులో జలక్రీడ, ప్రత్యేక  అభిషేకాలు నిర్వహించారు. 
వేడుకల్లో మున్సిపల్​  చైర్​ పర్సన్​ గుంటి రజనీ కిషన్, ఏసీపీ సంపత్​రావు, సీఐ పులి రమేష్, టెంపుల్​ చైర్మన్​ శింగిరికొండ మాధవశంకర్, ​ కౌన్సిలర్లు 
తదితరులు పాల్గొన్నారు.