కేంద్ర పథకాలు పేదలకు అందాలి : ఎంపీ బలరాం నాయక్

కేంద్ర పథకాలు పేదలకు అందాలి : ఎంపీ బలరాం నాయక్
  • దిశ మీటింగ్​లో ఎంపీ బలరాం నాయక్​

ములుగు, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్  సూచించారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన దిశ మీటింగ్​కు ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తేవడానికి తాను సహకరిస్తానని, ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడాన్ని అధికారులు అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు, గోదాంల ఏర్పాటుకు, చెక్​డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. నేషనల్ హైవే 163 జంగాలపల్లి నుంచి పసర ఫోర్ లేన్ పనులు ప్రారంభించాలని, జలగలంచ, కృష్ణాపురం, టేకులగూడెం బ్రిడ్జిల నిర్మాణానికి ప్రపోజల్స్ ఇవ్వాలని సూచించారు. 

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపినందుకు అధికారులను అభినందించారు. మీటింగ్​కు పలువురు అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి జరిగే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను అధికారులు ప్రజలకు వివరించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ చేయడానికి  చర్యలు తీసుకోవాలని కోరారు. దిశ మెంబర్​పూర్ణచందర్, కలెక్టర్​దివాకర టీఎస్, అడిషనల్​కలెక్టర్​మహేందర్​జీ, ఆర్డీవో వెంకటేశ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.