విద్య, వైద్యంలో మానుకోటకు పెద్దపీట : శంకర్‌‌ నాయక్‌‌

విద్య, వైద్యంలో మానుకోటకు పెద్దపీట : శంకర్‌‌ నాయక్‌‌

మహబూబాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ సహకారంతో మహబూబాబాద్‌‌ ప్రగతి పథంలో ముందంజలో ఉందని ఎమ్మెల్యే శంకర్‌‌ నాయక్‌‌ చెప్పారు. మహబూబాబాద్‌‌లోని శనిగపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్‌‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, విద్య, వైద్య రంగంలో జిల్లాకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీలో రూ. 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గిరిజన రైతులకు పోడు పట్టాలిచ్చి, రైతు బంధు, బీమా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌‌దేనన్నారు.

మహబూబాబాద్‌‌ జిల్లా యువతకు ఉపాధి కల్పన కోసం కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరగా సీఎం కేసీఆర్‌‌ సానుకూలంగా స్పందించారు. అనంతరం టీడీపీ స్టేట్‌ లీడర్‌‌ గండి సావిత్రమ్మ సీఎం కేసీఆర్‌‌ సమక్షంలో బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఎంపీ మాలోత్‌‌ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌‌రావు, జడ్పీ చైర్మన్‌‌ బిందు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ పాల్వాయి రామ్మోహన్‌‌రెడ్డి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని కోరిన అరూరి

హనుమకొండ/వరంగల్‌‌/కాజీపేట : వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లి సమీపంలో గల ఎస్‌‌ఆర్‌‌ కాలేజీ గ్రౌండ్‌‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌‌ హాజరయ్యారు. ముందుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌ మాట్లాడుతూ గ్రేటర్ విలీన గ్రామాల్లో సాదాబైనామా, అసైన్డ్‌‌ ల్యాండ్స్‌‌ సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, యువతకు ట్రైనింగ్‌‌ ఇచ్చేందుకు స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు చేయాలని కోరారు.

కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఎంపీ దయాకర్‌‌, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌‌ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు, గ్రేటర్‌‌ వరంగల్‌‌ మేయర్‌‌ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్‌‌ మార్నేని రవీందర్‌‌రావు పాల్గొన్నారు.