కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి
  • ఎమ్మెల్యే సునీతా రెడ్డి 

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని  ఎమ్మెల్యే సునీతా రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని  కాసాల, హత్నూర, లింగాపూర్, పన్యాల, కొన్యాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. 

ధాన్యానికి కావాలసిన సంచులను రైతులకు అందించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫర్హీన్ షేక్, ఏపీవో రాజశేఖర్, ఏవో శ్రీనివాసరావు, మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, పీఏసీఎస్​చైర్మన్లు దుర్గారెడ్డి, దామోదర్ రెడ్డి, డైరెక్టర్ వెంకటేశ్ పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించిన లైబ్రరీ చైర్​పర్సన్ 

శివ్వంపేట: మండలంలోని ఉసిరికపల్లి, కొంతన్ పల్లి, సీతారాం తండా, రత్నాపూర్, అల్లిపూర్, పిలుట్ల గ్రామాల్లోని  ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​సుహసిని రెడ్డి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే  రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దన్నారు.

 వర్షాలు పడుతున్నందున  ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తా, సొసైటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు గంగాధర్, మురళీ గౌడ్, ఏఈఓ మౌనిక, సీఈవో మధు పాల్గొన్నారు.