
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల కాలంలో వనపర్తిలో 49.33 కోట్ల విలువ జేసే సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులిచ్చామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 204 మంది లబ్ధిదారులకు రూ.2,04,23,664 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 230 మందికి రూ. 4 కోట్ల విలువజేసే ఎల్ఓసీలు ఇచ్చామని పేర్కొన్నారు.
వనపర్తిలో రూ.10.33కోట్ల విలువ చేసే 4776 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పది విడతలుగా రూ.39 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 3863 చెక్కులిచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.