
అచ్చంపేట, వెలుగు: మండలంలోని మన్నెవారిపల్లి నుంచి చందంపేట, దేవరకొండ వెళ్లేందుకు వీలుగా దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం మండలంలోని సిద్దాపూర్, మన్నెవారిపల్లి గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఉధృతంగా పారుతున్న దుందుభి నదిని ఎమ్మెల్యే పరిశీలించారు.
సిద్దాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా దేవరకొండకు వెళ్తుంటారని, ఆఫీస్ పని ఉంటేనే అచ్చంపేటకు వస్తారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ మల్లురవి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి కృషి చేస్తానని తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు, తహసీల్దార్ సైదులు, ఎస్సై పవన్ కుమార్, మాజీ ఎంపీపీ రామనాథం, రాఘవులు, బుచ్చిరాములు పాల్గొన్నారు.
గెల్వలాంబను దర్శించుకున్న ఎమ్మెల్యే
వంగూరు: గెల్వలాంబ అమ్మవారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్ నకినమోని శేఖర్ ముదిరాజ్ వారిని శాలువాతో సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ అంతటి మల్లేశ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.