నా మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు : అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

నా మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు : అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

నాగర్ కర్నూల్ టౌన్/లింగాల, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాటలను వక్రీకరిస్తూ అవాస్తవాలు మాట్లాడుతున్నాడని అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ మండిపడ్డారు. ఆదివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.  అసెంబ్లీలో తాను నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో వర్షపాతం 39శాతం తక్కువగా ఉందని, కరెంటు డిమాండ్ పెరిగిందని మాత్రమే చెప్పానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిదని అన్నట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరుతో రూ. 35 వేల అంచనాలతో ప్రారంభించి లక్ష కోట్లు దండుకున్నారని, నాసిరకం పైపులైన్లు, ట్యాంకులతో ప్రజలకు ఇబ్బందులు సృష్టించారని విమర్శించారు.

అనంతరం శ్రీపురం రోడ్డులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, లింగాల మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వంశీకృష్ణ ముఖాముఖిగా మాట్లాడారు. పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమని, తాను ఎల్లప్పుడూ వారి కష్టసుఖాల్లో ముందుంటానని భరోసా కల్పించారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. లింగాల మండలంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు.