షాద్‌నగర్ ప్రభుత్వ కాలేజీ అధ్వానంగా తయారైంది : వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్ ప్రభుత్వ కాలేజీ అధ్వానంగా తయారైంది : వీర్లపల్లి శంకర్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్‌‌, వెలుగు: ఎంతో చరిత్ర ఉన్న షాద్‌నగర్‌‌ ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీ ప్రస్తుతం అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అసహనం వ్యక్తం చేశారు.  శనివారం కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపల్,  ఫ్యాకల్టీతో ఆయన సమావేశమయ్యారు.  అంతకు ముందు కాలేజీ పరిసరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. దుమ్ము, ధూళితో ఉన్న రూమ్​లు, ఫర్నిచర్​ను  చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలేజీ అటెండెన్స్ రిజిస్టర్ చూసి సిబ్బంది ఎక్కడ ఉన్నారని ఆయన అడిగారు.  

ఇంతమంది సీఎల్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.  రెగ్యులర్ ప్రిన్సిపల్ ఎంఏ రవూఫ్ ఎక్కడ అని అడగగా..  మూడేళ్లుగా  డిప్యూటేషన్ మీద ఉన్నారని  సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు. మూడేళ్లుగా కాలేజీకి ప్రిన్సిపాల్ లేకపోతే ఉత్తీర్ణత శాతం ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ లేక 8 నెలలు అవుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే.. వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఆర్జెడీ అధికారిని జయప్రదకు  ఫోన్ చేశారు. 

కాలేజీలోని పరిస్థితులను వివరించారు.  కాలేజీని ఒకసారి సందర్శించి కావాల్సిన రిపేర్లను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ రవూఫ్​ను కాలేజీలో  రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.  షాద్​ నగర్ ప్రభుత్వాసుత్రికి ఇలాంటి పరిస్థితి రావడానికి గత ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కారణమని శంకర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే  వెంట  స్థానిక నాయకులు తిరుపతి రెడ్డి, రఘు, పురుషోత్తం రెడ్డి, సయ్యద్ ఖదీర్, బాదేపల్లి సిద్ధార్థ, ఖాదర్, వ్యక్తిగత కార్యదర్శి హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.