- కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యం
- మోదీ పాలనలో 100 లక్షల కోట్ల అప్పు
- ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ: ఓట్ల కోసమే కేసీఆర్ కరువు పర్యటనలు చేస్తూ దొంగ డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎం మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీతో కరువు రాలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ ఖాళీ గల్లా పెట్టెను మిగిల్చారని మండిపడ్డారు.
బిడ్డను ఈడీ వెంటాడుతుందని, కొడుకును, తండ్రిని ఫోన్ ట్యాపింగ్ కేసు వేటాడుతుందని చెప్పారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి అన్ని అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు. ఇ చ్చిన హామీలను నెరవేర్చకపోవటం మూలంగానే బీఆర్ఎస్ పడవ మునిగిపోయిందన్నారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. దేవుడిపేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ లీడర్లపై మండిపడ్డారు. ఇండియా కూటమితో జత కడుతున్నందుకు ఢిల్లీ సీఎంను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.గడిచిన 10 సంవత్సరాలో మోదీ పాలనలో దేశ అప్పు 100 లక్షల కోట్లు దాటిందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు బతుకలేరన్నారు.
భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధికమెజార్టీతో గెలిపించాలని కోరారు. మోదీ, అమిత్ షా జోడి కలిసి దేశాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని అభి వృద్ధి చేయకుండా వికసిత్ భారత్ అంటూ అబద్దాలాడుతూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు.