పాలమూరు, వెలుగు : అందరూ ఏకమైతేనే ఎంవీఎస్ కాలేజీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ ఎంవీఎస్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1965 నుంచి 2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరి పేరు, ఫోన్ నంబర్లను సేకరించి, ఆ వివరాలను తనకు ఇవ్వాలన్నారు. అందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో జరుపుకునే 60 ఏండ్ల వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని కోరారు.
ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఫండ్ ఎక్కువగా తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. కాలేజీకి మంచి ఆడిటోరియం, అన్ని రకాల సౌలతులు కల్పించి భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎస్.వినోద్ కుమార్, కేఎస్.రవికుమార్, బుర్రి వెంకట్రామిరెడ్డి, పద్మావతి, ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.