- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: త్వరలో జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డికి మాటిచ్చానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ డీసీసీ ఆఫీసులో ఆదివారం ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన ఆశావహులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. టికెట్ ఎవరికి వచ్చినా క్యాడర్ ఐక్యంగా అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలన్నారు.
నగరానికి స్వర్ణయుగం ప్రారంభమైందని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.2 వేల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేయించామని తెలిపారు. అనంతరం నగరంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే టీచర్స్ కాలనీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే వడ్డే ఓబన్న 219వ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్ బెల్డ్లో ఉన్న ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వసంత, మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీజే బెనహర్ పాల్గొన్నారు.
