మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: సంఘటితంగా ముందుకెళ్తేనే అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని టీఎన్జీవోస్ భవనంలో మాలల చైతన్య సమితి10వ ఆవిర్భావ దినోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. మాలల చైతన్య సమితి పదేళ్లుగా సమాజ హితం కోసం నిర్విరామంగా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, సామాజికరంగాల్లో మాలలు మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
యువత చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందన్నారు. చదువే భవిష్యత్తుకు పునాదిగా భావిస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉచిత విద్య , నాణ్యమైన వైద్యం పేదలకు అందించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మాలె కేశవులు, పత్తి యాదయ్య, బి రామకృష్ణ, పంబ వెంకటస్వామి, ఎం సుధాకర్, దాసరి శ్రీనివాసులు, ఎం రాములు, గజ్జల చెన్నయ్య, కావలి చెన్నయ్య, తిరుపతయ్య, పెరుమాళ్ల గోవిందయ్య పాల్గొన్నారు.
పట్టుదలతో చదివుకోవాలి..
మహబూబ్ నగర్ అర్బన్: ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు పట్టుదలతో చదువుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నగరంలోని బోయపల్లి ఎస్టీ హాస్టల్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు బెడ్ షీట్లను పంపిణీ చేశారు. పేద విద్యార్థుల సంక్షేమానికి రెడ్ క్రాస్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. మారేపల్లి సురేందర్ రెడ్డి, ఖాజా పాషా, అజ్మత్ అలీ ఉన్నారు.
